ఆంధ్రపత్రిక - స్వర్ణోత్సవ సంచిక
Andhra Patrika Svarnotsava Sanchika
దాదా హయాత్ గారు తెలిపారు .......
వేమూరి విశ్వనాథ శర్మ గారు, ఎం.ఏ., ఎల్.టి., యెవరో మనకు తెలీదు. నాకూ తెలీదు. వారు 1925 నాటికి నలభై వుత్తరాలు సేకరించారు. అవి అప్పటికే నూటయాభైసంవత్సరాలనాటివి. తంజావూరు రాజ్య వాస్తవ్యులకు సంబంధించిన తెలుగు వుత్తరాలు. ఇప్పుడు తమిళం ప్రధాన భాషగా వున్న తంజావూరు ప్రాంతంలో ఒకప్పుడు తెలుగేప్రధానభాషగా అందరూ వాడేవారని నిరూపించడానికి వాటిలో మచ్చుకు కొన్ని వుత్తరాలు వారు 'ఆంధ్రపత్రిక ' 1925 క్రోధన సంవత్సరాది సంచికలో 'దక్షిణాది తెలుగు; కొన్ని పాత వుత్తరాలు ' అనే పేరుగల వ్యాసంలో ప్రకటించారు.
వాటిలో ఒక శుభలేఖ చూడండి - "శ్రీమత్సమస్త సద్గుణసంపం న్న అఖండ్డిత లక్ష్మీ సేవా ప్రసం న్న అవ్యాజ పరోపకార అనేక ధర్మ పరిపాలక స్నేహిత పరిపూర్ణ వాత్సల్యమహం మ్మేరు సమాన ధీరులయ్ని మహారాజశ్రీ సంబ్భాజీ శివరావు వారికి,- శే|| వైద్యలింగ్గం సాష్టాంగ దండములుబెట్టి శాయంగల విం న్నపాలు యిచ్చట ఆవణి నెల 20తేదీ వర్కు కుశలం తమ నిరంత్తర సకల సంత్తోష సాంబ్రాజ్య అతిశయములకు వ్రాయించ్చి పంపిస్తూ రావలెను. త|| ఈనెల 24 తేది భానువారం దినమందు ధనుర్లగ్నమునచిరంజ్జీవి తం మ్ముడు శివచెదంబ్బరానికి వివాహముహూర్తం నిశ్చయమై వుం న్నది గన్క యింత్త పరియంత్రం విజయం చేసి ముహూర్తం నెఱవేర్చి యిప్పించేలాగ్నుశాయవలెను తాము అభిజ్ఞులు గన్క విశేషించ్చి వ్రాసుకోగలది లేదు గదా కడమ యిచ్చట నడ్వగల ప్రయోజనములంకున్ను అచ్చటి సుభోదయములంకుం న్ను వ్రాయించ్చిపంపిస్తూ రావలెను యింతే దండ్డములు."
తంజావూరు రాజు అమరసింహునికి పుదుచ్చేరి నవాబుగారు రాసిన జాబు చూడండి - "షహామతు అవాలిమర్త బతుషవుకతు వమాలీ మంజులతు మలాజు మెహెరుబాన్మొకర్రం మొకలీసాన్ మహారాజ అమరశింహ్మరాజే సల్లమల్లహుతాలా. మేముం న్నూ ఖుషీని వుం న్నాము. మీ ఖుశాలినామా హమేశా వ్రాయించ్చి పంప్పింస్తూరావలెను........."
ఇలాంటివి కాక శృంగేరి స్వామి శ్రీముఖం, అమరసింహుడు శంకరాచార్యులకు రాసిన వుత్తరాలు పొడవాటివే వీటిలో వున్నాయి. నాటి వాడుక భాషలోని అనేక పదాలుఇప్పటికీ మనం వాడుతున్నాం.
ఒక మహారాజుగారి "పుష్పగంధ కస్తూరి పం న్నీరు పరిమళాదుల చాత పూజ చాయపడినషువంట్టి పాదపద్మములకు" వెంకటరాఘవు అనే వేశ్య రాసిన అపూర్వమైనప్రేమలేఖ ఒకటి గద్యపద్యాలలో ఇందులో వుంది. అందులో చాలావరకు వాడుకభాషలో వున్న సీసపద్యం చూడండి-
సీ. వుండ్డుండ్డి యేమేమొ వూరకె చింత్తింత్తు
చింత్తించ్చి నాలోనె చిం న్న బోదు
చిం న్న బోయి యొకింత్తశేపు తెలివిగ నుంద్దు
తెలివి వ్యాళను మిం మ్ము తలపువచ్చు
తలచినంత్తనె వచ్చి నిలచినట్లనె తోచు
తోచిన నే దిగ్గున లేచి జూతు
జూచి వేగమె బార జాచి కౌంగిట గృత్తు
గృచ్చి కౌంగిట లేక వెచ్చనూర్తు
వెచ్చనూర్చియు తపియింత్తు వెతల నింత్తు
సఖుల గద్దింత్తు తెగువ యోచన తలంత్తు
నీదు మనసెంత్తు అంత్త నం న్నియు శమింత్తు
భవ్యగుణహారి వేణుగోపాల శౌరీ.
-తెలుగు అజంత భాష కావడంతో కుదిరిన అపురూప పదవిన్యాసమిది. బహుశా క్షేత్రయ్యకు ఛాయ కావచ్చు.
'ఆంధ్రపత్రిక ' వారు 1964-65 నాటి విశ్వావసు సంవత్సరాదికి తమ స్వర్ణోత్సవ సంచిక ప్రకటించారు. ఆ సంచికలో ఇదిగో వేమూరి విశ్వనాథ శర్మగారి ఈ అపురూపమైనవ్యాసాన్ని పునర్ముద్రించారు.
ఇంకా ఈ సంచికలో మనం గుర్తుంచుకోవలసినవారే కానీ, గుర్తించకుండా వదిలేసిన అనేకమంది మహానుభావులతో పాటు లబ్ధప్రతిష్ఠులైనవారి రచనలనేకం - అదివరకు'ఆంధ్రపత్రిక ' లో వచ్చినవి - మళ్ళీ వేశారు. వాటిలో కూడా మనం గుర్తుంచుకోవలసినవే కానీ, గుర్తించకుండా వదిలేసిన రచనలనేకం వున్నాయి. మంచి రచన చేసిన ప్రతిఒక్కర్నీ - మళ్ళీ మాట్లాడితే ఒక్క మంచి రచననీ గుర్తుంచుకోవాలనే రూలేదీ తెలుగువాళ్ళం మనం పెట్టుకోకపోయినా, 'ఔరా! ఇంత మంచి రచన ఇంతవరకూ చూడకపోతిమే!అడ్డెడ్డే!' అనుకునేపాటి సహృదయమైనా మనలో ఇంకా మిగిలే వుందనుకుంటే 'ఆంధ్రపత్రిక ' వారి ఈ స్వర్ణోత్సవ సంచిక ఒకసారి తిరగేయాల్సిందే!
వాటిలో చూడగానే కళ్ళుమెరిపించేవి కొన్నయితే, పెదాలపై చిరునవ్వు పూయించేవి మరికొన్ని.
దేవీప్రసాద్ చటోపాధ్యాయగారు 1959లో ప్రకటించిన 'లోకాయత ' పుస్తకం కంటే యెంతో ముందు వేలూరి శివరామ శాస్త్రిగారు చార్వాకులమీద 1921లోనే రాసిన'నాస్తికదర్శనములు ' అనే వ్యాసం ఆశ్చర్యం కలిగించక మానదు. ఆ వెంటనే 'శంకరమతమున జగత్తు అసత్యమా?' అనే బంకుపల్లి మల్లయ్య శాస్త్రులవారి వ్యాసం (1921). ఈసంచికలోని యేకైక స్త్రీ రచన మామిడన్న కామేశ్వరమ్మగారి 1911నాటీహిందూ స్త్రీల ప్రస్తుత స్థితి ' నిజంగా ఎన్నదగ్గ రచన. ఉన్నవ లక్ష్మీనారాయణగారి 'తిక్కన '. అఫ్ కోర్స్- పానుగంటివారి వ్యాసం 'కానుగ చెట్టు '. కథలు, వ్యంగ్యరచనలు, పాటలు, పద్యాలు - యెన్నో వున్నాయిందులో. మన ఆది కార్టూనిస్టు అనదగ్గ తలిశెట్టి రామారావుగారుఅప్పటి సామాజిక స్థితిగతులపై గీసిన వ్యంగ్య చిత్రాలు - వాటిలో ఆంధ్రుడి మనస్తత్వం మీద గీసిన కార్టూన్ చూసి తీరాల్సిందే. ఔరంగజేబు తన గురువుగారికి రాసినసుప్రసిద్ధమైన లేఖ. మనకిష్టమైన సినిమాల తొలి ప్రకటనలు. అన్నట్టు 'పొట్ట చీల్చి బిడ్డను తీయుట ' అనే ఆచంట లక్ష్మీపతిగారి వైజ్ఞానిక వ్యాసం కూ
డా ఇందులో వుంది - శ్రీ శ్రీ పుట్టిన సంవత్సరం (1910) నాటిది!
చాలా కాలం క్రితమే లక్కీగా ఈ సంచిక నాకు అంతర్జాలంలో దొరికింది. పట్టేశాను. ఇది మన 'తెలుగు పరిశోధన ' లో వుందనే అనుకున్నాను. కానీ లేదు. నా ప్రైజ్డ్ పొసెషన్,శర్మగారూ! మీకు పంపిస్తున్నాను.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
0 వ్యాఖ్యలు:
Post a Comment