Kadambari Rasajnata Perala Bharatha Sharma
విశ్వనాథ వారి అంతరంగాన్నే కాదు , వారి రచనల అంతరంగపు లోతుల్నీ తెలిసిన , లోకానికి తెలిపిన పండితవిమర్శకులు అయిన శ్రీ పేరాల వారు కవి , అవధాని , నాటక కర్త , గేయ నాటికాకర్తగా , వక్త గా ఆంధ్ర దేశాన పేరెన్నిక గన్న వారు ..
1933 , ఫిబ్రవరి 2 వతేదీన , బాలకృష్ణయ్య , రాజ్యలక్ష్మమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా చీరాల లో జన్మించిన శర్మగారి ఉన్నత విద్యాభాసం గుంటూరు లోని హిందూ కళాశాల లోనూ , విజయవాడ ఎస్.ఆర్ & సి.వి.ఆర్ కళాశాలలలో జరిగింది ..
డిగ్రీ పూర్తి చేసిన వెంటనే భరతశర్మ గారు తాము చదివిన S R & C V R కళాశాల లోనే ట్యూటర్ గా చేరి ప్రైవేటుగా బెనారస్ విశ్వ విద్యాలయం నుండి సంస్కృతం లో ఎం. ఏ పూర్తి
చేశారు ..
1960 వరకు విజయవాడలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదోన్నతి పై కాకినాడ P R కాలేజీకి వెళ్ళి 1985 వరకు అక్కడ ఉద్యోగించారు .. తరువాత ప్రిన్స్ పాల్ గా మరోసారి పదోన్నతి పొంది విజయనగరం లోని మహారాజ వారి సంస్కృత కళాశాల లో వృత్తిన విజయవంతంగా నిర్వహించి 1991 లో ఉద్యోగ విరమణ చేశారు ..
2002 , డిసెంబరు 13 న పరమపదించే వరకు వారు నిత్యసాహితీవ్రతులై దాదాపు 400 కుపైగా అవధానాలను , వందలాది సాహిత్య ప్రసంగాలను అందించిన శ్రీ పేరాల భరత శర్మ గారు ధన్యమూర్తులు.."
- డా.ఆర్.వి.కుమార్ గారు
పేరాల బాలు గారు"నాన్నగారు వ్రాసిన " కాదంబరీ రసజ్ఞత " బాణ కాదంబరి పై ఒక ఆధికారకమైన విమర్శ గ్రంథం. 1978 లో ఒక రోజు "నేనొక పుస్తకం వ్రాద్దామనుకుంటున్నాను. నువ్వు లేఖకుడిగా వుంటానంటే " అన్నారు నాదగ్గరకొచ్చి. అప్పుడు నేను బి కాం మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేను సరేనన్నాను . భుజం తట్టి, "నేనెప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వేస్థితిలో వున్నా పగలైనా రాత్రైనా, అర్ధరాత్రైనా నువ్వు లేఖకుడిగా సహకరిస్తానంటే నేను మొదలు పెడతానాన్నా" అన్నారు. హఠాత్తుగా అర్ధరాత్రి నిద్రలేపి పెన్ను, pad ఇచ్చి వ్రాయించిన రోజులెన్నో. కాకినాడలో ఆలమూరు వారింట్లో వుండే వాళ్ళం ఆరోజుల్లో. సడెన్గా పెరట్లోకి వెళ్లి బావి గట్టుమీద కూర్చునేవారు. పక్కవాళ్ళ సరిహద్దు గోడమీద కూర్చునేవారు. లేదా ముందుగది కిటికీలో వ్రేలాడుతూ కూర్చుని చెపుతుండేవారు. ఒకప్పుడు చాలాసేపు మౌనంగా కళ్ళుమూసుకుని కూర్చుండి పోయేవారు. ఏదిఏమైనా నాన్నగారితో ఒప్పందం నేను వారు చెప్పేదాకా ఆయన దగ్గర కూర్చుని వ్రాయడమే. ఇప్పటికీ ఆ వ్రాతప్రతి విశాఖలో మాయింట్లో వుంది.ఎంతమంది విశ్వవిద్యాలయ విద్యార్థులకు, అధ్యాపకులకు ఈ పుస్తకం ఎంత ఉపయోగపడిందో! ఎన్ని మహత్తరమైన విశేషాలు అందులో వివరించారో. దేశంలో ( కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాదు) అన్ని ప్రముఖ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, నగర గ్రంథాలయాలలో ఈ పుస్తకం వున్నదో నాకు బాగా తెలుసు. నేను నాన్నగారు కలిసి ఈ పుస్తకాన్ని వి పి పి ద్వారా ఎన్ని విద్యా సంస్థలకు పంపించామో నాకు బాగా గుర్తు. ఈ పుస్తకావిష్కరణసభ కాకినాడ ఈశ్వర పుస్తక భాండాగారం లో జరిగింది.ఈ కాదంబరిలో ఎన్నో శ్రీవిద్యా రహస్యములు చెప్పాను నేను అనేవారు. నాకు అంతగా అర్థమయ్యేది కాదు. విని వూరుకునేవాడిని . మా మధ్య ఒప్పందం వారు చెప్పింది నేను వ్రాసి పెట్టటమే కదా! కానీ ఈ పుస్తకానికి అభిప్రాయం వ్రాసిన శ్రీవెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు ".......................ప్రకృతమునకు వత్తును. కాదంబరీ రసజ్ఞత యని పేరు పెట్టి యీ గ్రంథమును రచించిన శ్రీ పేరాల భరతశర్మగారు నిద్రాహారము లెంతకాలము లేకుండనింత గ్రంథము రచించిరో యనుకొంటిని. కాని ఆహారనిద్రలకు దూరముకాకుండనే పిఠాపురరాజా ప్రభుత్వకళాశాల (కాకినాడ) లో సంస్కృతోపన్యాసకత్వము ,యథాపూర్వము నడుపుకొనుచునే రసజ్ఞులగు పెద్దలు అవధానార్థ మాహ్వానించినపుడు అష్టశతావధానములు చేయుచునే యింత విపులమైన విమర్శనముతో అసాధారణకవితాధురంధరుఁడైన భట్టబాణ మహాకవియొక్క నిరుపమ మైన కాదంబరీ గద్యకావ్యసాగరమును మథించి యందలి యమృతమును ఆంధ్రలోకమున కెట్లoదింపఁగలిగిరో ! అని ఆశ్చర్యపడితిని. ప్రతిభాశాలి కసాధ్య మేముండును ! అనుకొంటిని.2. కాదంబరి యన కల్లుకాదు. సరస్వతి అని యనుకొంటిమికదా ! బాణునిసరస్వతియన అతని రచనయగు కథాకావ్యము అన్నమాట. దానియందు రసమున్నదని ఆ రసము నెఱిఁగినవారు కాదంబరీ రసజ్ఞులు అనుకొన్నాముక దా! అట్టి రసజ్ఞులలో నొకరై న శ్రీ భరతశర్మగారు తనకుఁ గలిగిన రసజ్ఞానమును గాలికిఁబోవువాగ్రూపముగాఁగాక అక్షరరూపముగా నిట్లువెలువరించి తామేకాక యావదాంధ్ర వసుంధరను ధన్యమొనర్చి ధన్యులైనారు..............హెచ్చైనను చాదస్తమని యెవరనుకొనినను నాలుగుమాటలు వ్రాయక మానజాలనిది "కథాతత్వము" అనెడి విభాగము. ఇందు కాదంబరి కథ యంతయు శ్రీవిద్యా పరముగా భరతశర్మగారు కామకళావిలాసము మున్నగు శాక్తమత గ్రంథముల యాధారమున నిరూపించుట మెచ్చదగినది. 122 వ పుటలో బాణుడు కాదంబరీ కథావస్తునిర్మాణమున నొకనిగూడమైన తాత్త్వికరహస్యమునిమిడ్చెననిస్పష్టమగును. అది వేదసమ్మతము, శాస్త్రవిహితము, యోగ సిద్ధము” అని యుపక్రమించి శ్రీమహాత్రిపురసుందరీ పరదేవతా తత్వప్రతిపాదకమైన కామకళా విలాసమను గ్రంథమును బట్టి మనకు తెలియని యెన్నియో విషయముల నెత్తికొనిప్రకృతకథకు సమన్వయించుట యత్యద్భుతము...........".ఈ సమీక్ష చదివిన తర్వాత నాన్నగారు నాతో తాను ఈ పుస్తకంలో వ్రాసానని చెప్పిన శ్రీవిద్యా రహస్యములు అన్నమాట అబ్బురపరచింది. తానెప్పుడూ నాది మానసిక పూజ నాయనా. నా ఉపాసన అంతా అంతర్గతమైనది అన్న మాటలకు అర్థం తెలిసింది."
గ్రంథరాజాన్ని దిగుమతి చేసుకునేందుకు ..........
కాదంబరీ రసజ్ఞత
................పై నొక్కండి.
"భరత శర్మగారి సాహిత్యంపై సమగ్ర పరిశోధన రావలసి ఉంది. పేరాల సాహిత్య పీఠం వేదికను ఏర్పరిచి సమర్ధులచే ఉపన్యాసాలు ఇప్పించడం చేయాలి.పాఠ్యగ్రంధాల్లో స్కూలు, కాలేజి, విశ్వ విద్యాలయస్థాయిల్లో వారి రచనలు వుండేటట్టు ప్రయత్ని0చాలి.
మహాకవి మిగిల్చిపోయిన వెలుగులు జాతికి పంచవలసిన అవసరం ఉంది"- బులుసు వేంకటేశ్వర్లు మాష్టారు.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.