26 August, 2019

మల్లాది సూర్యనారాయణ శాస్త్రి రచనలు Malladi Suryanarayana Shastri Rachanalu

మల్లాది సూర్యనారాయణ శాస్త్రి రచనలు Malladi Suryanarayana Shastri Rachanalu





ఈయన తల్లి వేంకమాంబ,తండ్రి శ్రీరామావధానులు.వీరి జన్మస్థలము చినకడియపులంక (దీనికి బుర్రిలంక-మల్లాదివారిలంక యని నామాంతరములు). వీరు ఫిబ్రవరి 20 1880 న అనగా ప్రమాది నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి నాడు జన్మించారు. మహాపండితులు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వద్ద వ్యాకరణశాస్త్రాధ్యయనము చేశారు. స్వయంకృషితో ఉభయభాషావిశారదులై 1900లో అమలాపురము హైస్కూలులో ఉపాధ్యాయులుగా నాలుగు సంవత్సరాలు పనిచేశారు. తర్వాత ఆంధ్రసాహిత్యపరిషత్తు వ్యవహర్తగా నొకయేడు ఉద్యోగం నిర్వహించారు. 1915లో రాజమండ్రి ట్రైనింగుకాలేజిలో అధ్యాపకుడిగా పనిచేశారు. అటు తర్వాత అనంతపురము దత్తమండల కళాశాలలో  మూడేండ్లు అధ్యాపకుడిగా పనిచేశారు. మరల రాజమహేంద్రవరముఆర్ట్సు కాలేజిలో 1919 - 1931 నడుమ పండ్రెండు వత్సరములు తెలుగు పండితులుగా ఉద్యోగం చేశారు. అక్కడినుండి ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో పదియేండ్లపాటు పనిచేశారు. మొత్తముమీద నాలుగుదశాబ్దులు పఠనపాఠనములలో వీరు ఆరితేరారు. ఈలోపుననే వీరు కొన్ని గౌరవోద్యోగములు నిర్వహించిరి. వేంకటగిరి రాజావారి సంస్థాన కవితాపదవి 1909 - 1919 మధ్య, జటప్రోలు సంస్థానవిద్వత్ స్థానము 1910 - 1917 నడుమ నిర్వహించారు. నారయ్యప్పారావు సంస్థాన విద్వత్కవిత్వ పట్టము 1919 - 1926 నడుమ నడిపినారు. ఈవిధముగా సంస్థానకవులై,  ఉపాధ్యాయులై అంతేవాసులకెందఱకో విద్యాభిక్ష పెట్టారు.

గ్రంథములు[మార్చు]

  1. సంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు). ఆంధ్రవిశ్వకళా పరిషత్ ప్రచురణములు.                                      1. వైదిక భాగము.                                                                                                                                  2. లౌకిక భాగము
  2. ఆంధ్రభాషానుశాసనము (2 భాగములు. చరిత్రాత్మకవ్యాకరణము)
  3. ఆంధ్రదశరూపకము (తెనుగుసేత)
  4. భాసనాటక కథలు (వచనము 2 భాగములు)
  5. ప్రేమ తత్త్వము (స్వతంత్ర పద్యకావ్యము)
  6. ఉత్తరరామచరిత్ర (ఆంధ్రీకృతి)
  7. భీష్మప్రతిజ్ఞ (స్వతంత్రనాటకము)
  8. ఆంధ్రభవిష్యపర్వము (పద్యప్రబంధము)
  9. భవభూతినాటక కథలు
  10. విదురనితి
  11. స్త్రీధర్మబోధిని
  12. సత్యకీర్తినాటిక
  13. కలివిడంబనము
  14. మహాభారత విమర్శనము
  15. సత్యకీర్తి
  16. విశ్రుతోర్వశీయము
  17. వ్యాసరత్నావళి
  18. సంస్కృత కవి జీవితము
  19. మాలతీ మాధవము

సంస్కృతరచనములు[మార్చు]

  1. బ్రహ్మసూత్రార్థదీపిక
  2. రజోనన్తర వివాహము
  3. సంస్కృతభాషా (ఇవి షష్టిపూర్తి సంపుటములో ముద్రితములు) అనేక పత్రికలలో వ్యాస రచనలు.
  4. పండితాభిప్రాయ మణిమాలిక

సాహితీ రంగంలో సేవలు

వీరు సంస్కృతాంధ్రములయందు గావలసినంత నికరమైన పాండిత్యము గలవారు. ఈ పాండిత్యమునకు దీటయినది వారికి గల యభినివేశము. సంస్కృతవాజ్మయ చరిత్ర, ఆంధ్రభాషానుశాసనము మున్నుగా వారు రచించిన కృతులు శాస్త్రిగారి పట్టుదలను బ్రదర్శించుటకు బట్టుగొమ్మలయినవి. ఆయనకు కవిగానున్న కీర్తికంటె, అధ్యాపకుడుగా విమర్శకుడుగానున్న పేరుపెంపులు పెద్దవి. వీరు అనువాదములేకాక స్వతంత్రరచనలు కూడ కావించిరి. వీరి కృతులన్నియు పాఠ్యములుగా నిర్ణయింపబడ్డాయి. 'సంస్కృత వాజ్మయచరిత్ర' వీరిది శాశ్వతముగా నుండ దగినగ్రంథము. ఒకదశాబ్దము చేసిన నిరంతరకృషి ఫలము. వైదికవాజ్మయము, లౌకికవాజ్మయము అని రెండుభాగములుగా ఈ గ్రంథము విభజింపబడి వ్రాయబడినది. ఆంగ్లములో ఇదివఱకు సంస్కృతవాజ్మయ చరిత్రమున కల పొరపాటులు పేర్కొని, మనోహరము నిర్గుష్టము అయిన ఫక్కిలో వీ రీ గ్రంథమును రచించిరి. వెంకటగిరి సంస్థానాధిపతుల ప్రోత్సాహముచే "సంస్కృత కవిజీవితములు" తెనుగులో రచించి వెలువరించిరి. ఈరెండు గ్రంథములు వీరికి కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టింది. పింగళి సూరనార్యుని 'కళాపూర్ణోదయము' ముద్రణదోషములతోను, విరుద్ధపాఠభేదములతోను నుండి యర్ధావగతికి గష్ట పెట్టుచున్నదని వీరు పరిశ్రమించి, పాఠభేదములు గుర్తించి సరిచేసి భావప్రకాశిక యను టీకతో, ఆమహాకావ్యమును లెస్సయగు తీరులోనికి గొనితెచ్చిరి. ఇది ముద్రింపించినవారు పీఠికాపురాధీశ్వరులు. వీరు ఆంధ్రవిశ్వకళా పరిషత్తు సెనేట్, అకడమిక్కు కౌన్సిలు, ఓరియంటల్ ఫాకల్టీ మొదలగువానిలో సభ్యుడై పండితులకు సంస్కృతాంధ్రములకు సంబంధించిన తీర్మానములు తెచ్చెడివారు. 1927 సం.లో వీరి అధ్యక్షతన ప్రారంభమైన "ఉపాధ్యాయ పండిత పరిషత్తు" నేడు తెలుగునేలలో నలుమూలల ప్రాకి ప్రభుత్వము వారిచే గొన్ని ఉపయోగములు చేయించుకొన్నది. 'ఆంధ్ర భాషానుశాసనము' అనుపేరుగల వీరి వ్యాకరణగ్రంథమునకు గొప్పప్రతిష్ట వచ్చినది.




ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

18 August, 2019

కాదంబరీ రసజ్ఞత పేరాల భరతశర్మ Kadambari Rasajnata Perala Bharatha Sharma

కాదంబరీ రసజ్ఞత పేరాల భరతశర్మ 
Kadambari Rasajnata Perala Bharatha Sharma



 "తెలుగునాట విశ్వనాథ సత్యనారాయణ  గారి పేరు స్మరించగానే స్ఫురణ కు వచ్చే అతి ముఖ్యమైన వ్యక్తుల లో శ్రీ పేరాల భరతశర్మ గారు ముఖ్యులు..
విశ్వనాథ వారి అంతరంగాన్నే కాదు , వారి రచనల అంతరంగపు లోతుల్నీ తెలిసిన , లోకానికి తెలిపిన పండితవిమర్శకులు అయిన శ్రీ పేరాల వారు కవి , అవధాని , నాటక కర్త , గేయ నాటికాకర్తగా , వక్త గా ఆంధ్ర దేశాన పేరెన్నిక గన్న వారు ..
1933 , ఫిబ్రవరి 2 వతేదీన , బాలకృష్ణయ్య , రాజ్యలక్ష్మమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా చీరాల లో జన్మించిన శర్మగారి ఉన్నత విద్యాభాసం గుంటూరు లోని హిందూ కళాశాల లోనూ , విజయవాడ ఎస్.ఆర్ & సి.వి.ఆర్ కళాశాలలలో జరిగింది ..
డిగ్రీ పూర్తి చేసిన వెంటనే భరతశర్మ గారు తాము చదివిన  S R & C V R  కళాశాల లోనే ట్యూటర్ గా చేరి ప్రైవేటుగా బెనారస్ విశ్వ విద్యాలయం నుండి సంస్కృతం లో ఎం. ఏ పూర్తి
చేశారు ..
1960 వరకు విజయవాడలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదోన్నతి పై  కాకినాడ P R కాలేజీకి వెళ్ళి 1985 వరకు అక్కడ ఉద్యోగించారు .. తరువాత ప్రిన్స్ పాల్ గా మరోసారి పదోన్నతి పొంది విజయనగరం లోని మహారాజ వారి సంస్కృత కళాశాల లో వృత్తిన  విజయవంతంగా నిర్వహించి 1991 లో ఉద్యోగ విరమణ చేశారు ..
2002 , డిసెంబరు 13 న పరమపదించే వరకు వారు నిత్యసాహితీవ్రతులై  దాదాపు 400 కుపైగా అవధానాలను , వందలాది సాహిత్య ప్రసంగాలను అందించిన శ్రీ పేరాల భరత శర్మ గారు ధన్యమూర్తులు.."
                                                               - డా.ఆర్.వి.కుమార్ గారు


"నాన్నగారు వ్రాసిన " కాదంబరీ రసజ్ఞత " బాణ కాదంబరి పై ఒక ఆధికారకమైన విమర్శ గ్రంథం.  1978 లో ఒక రోజు "నేనొక పుస్తకం వ్రాద్దామనుకుంటున్నాను.  నువ్వు లేఖకుడిగా వుంటానంటే " అన్నారు నాదగ్గరకొచ్చి. అప్పుడు నేను బి కాం మొదటి సంవత్సరం చదువుతున్నాను.  నేను సరేనన్నాను .  భుజం తట్టి, "నేనెప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వేస్థితిలో వున్నా పగలైనా రాత్రైనా, అర్ధరాత్రైనా నువ్వు లేఖకుడిగా సహకరిస్తానంటే నేను మొదలు పెడతానాన్నా" అన్నారు. హఠాత్తుగా అర్ధరాత్రి నిద్రలేపి పెన్ను, pad ఇచ్చి వ్రాయించిన రోజులెన్నో.  కాకినాడలో ఆలమూరు వారింట్లో వుండే వాళ్ళం ఆరోజుల్లో.  సడెన్గా పెరట్లోకి వెళ్లి బావి గట్టుమీద కూర్చునేవారు. పక్కవాళ్ళ సరిహద్దు గోడమీద కూర్చునేవారు. లేదా ముందుగది కిటికీలో వ్రేలాడుతూ కూర్చుని చెపుతుండేవారు. ఒకప్పుడు చాలాసేపు మౌనంగా కళ్ళుమూసుకుని కూర్చుండి పోయేవారు.  ఏదిఏమైనా నాన్నగారితో ఒప్పందం నేను వారు చెప్పేదాకా ఆయన దగ్గర కూర్చుని  వ్రాయడమే.  ఇప్పటికీ ఆ వ్రాతప్రతి విశాఖలో మాయింట్లో వుంది.
ఎంతమంది విశ్వవిద్యాలయ విద్యార్థులకు, అధ్యాపకులకు ఈ పుస్తకం ఎంత ఉపయోగపడిందో! ఎన్ని మహత్తరమైన విశేషాలు అందులో వివరించారో. దేశంలో ( కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాదు) అన్ని ప్రముఖ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, నగర గ్రంథాలయాలలో ఈ పుస్తకం వున్నదో నాకు బాగా తెలుసు.  నేను నాన్నగారు కలిసి ఈ పుస్తకాన్ని వి పి పి ద్వారా ఎన్ని విద్యా సంస్థలకు పంపించామో నాకు బాగా గుర్తు.  ఈ పుస్తకావిష్కరణసభ కాకినాడ ఈశ్వర పుస్తక భాండాగారం లో జరిగింది.  
ఈ కాదంబరిలో ఎన్నో శ్రీవిద్యా   రహస్యములు చెప్పాను నేను అనేవారు.  నాకు అంతగా అర్థమయ్యేది కాదు.  విని వూరుకునేవాడిని .  మా మధ్య ఒప్పందం వారు చెప్పింది నేను వ్రాసి పెట్టటమే కదా!  కానీ ఈ పుస్తకానికి అభిప్రాయం వ్రాసిన  శ్రీవెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు ".......................ప్రకృతమునకు వత్తును.  కాదంబరీ రసజ్ఞత యని పేరు పెట్టి యీ గ్రంథమును రచించిన శ్రీ పేరాల భరతశర్మగారు నిద్రాహారము లెంతకాలము లేకుండ
నింత గ్రంథము రచించిరో యనుకొంటిని. కాని ఆహారనిద్రలకు దూరముకాకుం
డనే పిఠాపురరాజా ప్రభుత్వకళాశాల (కాకినాడ) లో సంస్కృతోపన్యాసకత్వము ,
యథాపూర్వము నడుపుకొనుచునే రసజ్ఞులగు పెద్దలు అవధానార్థ మాహ్వానించినపుడు అష్టశతావధానములు చేయుచునే యింత విపులమైన విమర్శనముతో అసాధారణ
కవితాధురంధరుఁడైన భట్టబాణ మహాకవియొక్క నిరుపమ మైన కాదంబరీ గద్య
కావ్యసాగరమును మథించి యందలి యమృతమును ఆంధ్రలోకమున కెట్లoదింపఁ
గలిగిరో ! అని ఆశ్చర్యపడితిని. ప్రతిభాశాలి కసాధ్య మేముండును ! అనుకొంటిని.
2. కాదంబరి యన కల్లుకాదు. సరస్వతి అని యనుకొంటిమికదా ! బాణుని
సరస్వతియన అతని రచనయగు కథాకావ్యము అన్నమాట. దానియందు రసమున్నదని ఆ రసము నెఱిఁగినవారు కాదంబరీ రసజ్ఞులు అనుకొన్నాముక దా! అట్టి రసజ్ఞులలో నొకరై న శ్రీ భరతశర్మగారు తనకుఁ గలిగిన రసజ్ఞానమును గాలికిఁబోవు
వాగ్రూపముగాఁగాక అక్షరరూపముగా నిట్లువెలువరించి తామేకాక యావదాంధ్ర వసుంధరను ధన్యమొనర్చి ధన్యులైనారు.
.............హెచ్చైనను చాదస్తమని యెవరనుకొనినను నాలుగుమాటలు వ్రాయక మానజాలనిది "కథాతత్వము" అనెడి విభాగము.  ఇందు కాదంబరి కథ యంతయు శ్రీవిద్యా పరముగా భరతశర్మగారు కామకళావిలాసము మున్నగు శాక్తమత గ్రంథముల  యాధారమున నిరూపించుట మెచ్చదగినది. 122 వ పుటలో బాణుడు కాదంబరీ కథావస్తునిర్మాణమున నొకనిగూడమైన తాత్త్వికరహస్యమునిమిడ్చెననిస్పష్టమగును.  అది వేదసమ్మతము, శాస్త్రవిహితము, యోగ సిద్ధము” అని  యుపక్రమించి శ్రీమహాత్రిపురసుందరీ పరదేవతా తత్వప్రతిపాదకమైన కామకళా విలాసమను గ్రంథమును బట్టి మనకు తెలియని యెన్నియో విషయముల నెత్తికొని
ప్రకృతకథకు సమన్వయించుట యత్యద్భుతము...........". 
ఈ సమీక్ష చదివిన తర్వాత నాన్నగారు నాతో తాను ఈ పుస్తకంలో వ్రాసానని చెప్పిన శ్రీవిద్యా రహస్యములు అన్నమాట అబ్బురపరచింది.  తానెప్పుడూ నాది మానసిక పూజ నాయనా.  నా ఉపాసన అంతా అంతర్గతమైనది అన్న మాటలకు అర్థం తెలిసింది."
                                                                                        పేరాల బాలు గారు


  గ్రంథరాజాన్ని దిగుమతి చేసుకునేందుకు ..........
                                      కాదంబరీ రసజ్ఞత
               
                                                                      ................పై నొక్కండి.



"భరత శర్మగారి సాహిత్యంపై సమగ్ర పరిశోధన రావలసి ఉంది. పేరాల సాహిత్య పీఠం  వేదికను ఏర్పరిచి సమర్ధులచే ఉపన్యాసాలు ఇప్పించడం చేయాలి.పాఠ్యగ్రంధాల్లో స్కూలు, కాలేజి, విశ్వ విద్యాలయస్థాయిల్లో వారి రచనలు వుండేటట్టు ప్రయత్ని0చాలి. 
మహాకవి మిగిల్చిపోయిన వెలుగులు జాతికి పంచవలసిన అవసరం ఉంది" 
                                                                              - బులుసు వేంకటేశ్వర్లు మాష్టారు.


 




ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

20 October, 2018

పాండురంగ మాహాత్మ్యం - పామర వ్యాఖ్యా సహితం Panduranga Mahathmyam - Pamara vyakhya


పాండురంగ మాహాత్మ్యం - పామర వ్యాఖ్య Panduranga Mahathmyamu - Pamara vyakhya


పాండురంగ మాహాత్మ్యం-పామర వ్యాఖ్య



తెలుగు సాహిత్యంతో ఏ కొంచెం పరిచయం ఉన్నవారయినా తెనాలి రామకృష్ణ కవి గూర్చి వినక ఉండరు. ఆయన రాసిన పాండురంగ మాహాత్మ్యం కూడా ప్రసిద్ధమే. అది ప్రౌఢ ప్రబంధం.  గతంలో ఈ గ్రంథాన్ని బులుసు వేంకటరమణయ్యగారి టీకతో తెలుగుపరిశోధన మీకు అందించింది. ఇక ఇప్పుడు 'పామర' వ్యాఖ్యతో మీకు అందించే అవకాశం కల్పించినవారు రసజ్ఞభారతి వ్యవస్థాపకులు ఆచార్య ఆర్.వి.కుమార్ గారు. వారికి సహస్రానేక కృతజ్ఞతాభివందనాలు.

ఈ 'పామర' వ్యాఖ్యను మనకొరకు అందించినవారు డా.దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు. వారు వృత్తిరీత్యా సామాన్యులకు దురవగాహమైన ఎన్నో విషయాలను పరిశీలించి లోకసామాన్యానికి అర్థమయ్యేతీరులో వ్యాఖ్యానించి చెప్పే రేడియాలజిష్టు. వారు తమ ఆ తృతీయనేత్రాన్ని  సాహిత్యంలో కూడా పారించారు. ఇంకేం సామాన్యులకు పాండురంగ మహాత్మ్యం అర్థం కావడం కష్టం. దాన్ని కూడా పరిశీలించి, మనకు  వ్యాఖ్యానించి అందించారు.  అదీ అందరికీ ఉచితంగా అందించాలనే సత్సంకల్పంతో .... 

ఈ రసజ్ఞభారతి గూర్చి, వ్యాఖ్యా రచయితగూర్చి, వారి మిత్రబృందంగూర్చి అన్ని విషయాలను ఆ పుస్తకంలోనే చదువండి. 

మరింకేం ఆలస్యం .......


పాండురంగ మాహాత్మ్యం-పామరవ్యాఖ్య by Dr.Pandu Ranga Sharma Ramaka on Scribd




ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోవాలనుకుంటే .......


పై నొక్కండి.

ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

12 August, 2018

చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర Sociological History Of Telugu literature

చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర 
Sociological History Of Telugu literature 
Dr.ముదిగంటి సుజాతా రెడ్డి


డా. ముదిగంటి సుజాతా రెడ్డి గారి ఈ రచన ఒక విశిష్టమైన రీతిలో సాగిన తెలుగు సాహిత్య చరిత్ర. విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ కరదీపిక.

18 June, 2018

నవల Navala

నవల Navala

ఆర్కైవ్ లో (DLL వారివి) కొన్ని నవలలు కన్పించినాయి. వాటిని అందుబాటులోకి తెస్తే ఔత్సాహికులైన పాఠకులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సాధ్యమైనవాటిని అందిస్తున్నాము.

17 June, 2018

తెలుగులో వివిధ ప్రక్రియలు Telugulo vividha Prakriyalu

తెలుగులో వివిధ ప్రక్రియలు
 Telugulo vividha Prakriyalu

తెలుగులో వెలువడిన వివిధ ప్రక్రియలపై గతంలో ప్రపంచమహాసభల వేళలో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు చిన్న చిన్న పుస్తకాలు వెలువరించారు. అటువంటివి పరిశోధకులకు, పరీక్షార్థులకు ఉపయోగకరమని, అంతర్జాలంలో లభించినవాటిని ఒక్కదగ్గర సంగ్రహిస్తున్నాము.

16 June, 2018

తెలుగులో చిత్రకవిత్వం TelugulO Chitra kavitvam

తెలుగులో చిత్రకవిత్వం 
TelugulO Chitra kavitvam 
గాదె ధర్మేశ్వర రావు Gade Dharmeswara Rao

తెలుగులో చతుర్విధ కవిత్వాల్లో  చిత్రకవిత్వం ఒకటి. ఇది నన్నె చోడుని కాలంనుండే తెలుగులో ఉన్నా, సంస్కృతంనుండి మనకు వచ్చిందని చెప్పడానికి సందేహం లేదు. ఎందరో కవులు చిత్రకవిత్వంలో పరిశ్రమ చేసారు

11 June, 2018

జాతక కథలు Jataka Kathalu

జాతక కథలు 
Jataka Kathalu







జాతక కథలు భారతదేశంలో ప్రాచుర్యం పొందిన బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం. క్రీ.పూ 300 — క్రీ.శ 400 మధ్యలో రచించబడినట్టుగా చెప్పబడుతున్న ఈ కథలన్నీ పాళీ భాషలో లభ్యమయ్యాయి. తరువాత అనేక భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. వీటి సంఖ్య సుమారుగా 550-600 మధ్యలో ఉంటుంది.

అనుసరించువారు