మచ్చ హరిదాసు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమే తెలుగులో యాత్రా చరిత్రలు. ఇందులో తెలుగులో వెలువడిన యాత్రా చరిత్రలు చక్కగా సేకరించి,వివరించారు. మంచి సమాచారం ఉంది.
గుండు లక్ష్మణ శాస్త్రి గారిచే వ్రాయబడిన ఈ ఆనంద రామాయణము తెలుగు వారికి మరుగున పడినట్లైనది.ఇదొక అపురూప కావ్యం. సంస్కృతంలోని ఆనందరామాయణానికి ఇది అనువాదమో కాదో తెలీదు. కానీ, రసనిర్భరము. చదివి ఆనందించండి.
కొట్ర శ్యామల కామశాస్త్రిగారు రచించిన బృహత్తర నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము. దానిని సమగ్రంగా అందించే భాగ్యం తెలుగు పరిశోధన వారికి కలిగింది. దీనికొరకు పాఠకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. దిగుమతి చేసుకుని, ఆనందించండి.
తెలుగులో వెలువడిన మొట్టమొదటి పురాణం మారన రాసిన మార్కండేయ పురాణం. దానిని పరిశోధించే నెపంతో సుబ్రహ్మణ్యంగారు తెలుగులో పురాణాల పుట్టు పూర్వోత్తరాలను చక్కగా పరామర్శించారు. తెలుగు సాహితీ పిపాసకులకు చక్కని పరామర్శ గ్రంథమిది. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం.
వావికొలను సుబ్బారావుగారు రచించిన మందరము తెలుగువారికి నిజంగా రామాయణ విషయ విశేష మందారమే. దీనికి వారు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అనే పేరు పెట్టినా మందరము గానే ప్రసిద్ధమిది. శ్రీ భక్తి సంజీవని వారు అందించే ప్రయత్నం చేసారు. సాయి రియల్ ఆటిట్యూడ్ వారు కూడా ఆ ప్రయత్నమే చేసారు. ఇప్పటికీ ఇంకా మనం దిగుమతి చేసుకోకుంటే ఎలా? చదువకుంటే ఎలా?